Disinvestment | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సర్కారీ బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థల్లో వాటాలను త్వరగా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే దాని సహాయార్థం ఆయా మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ కంపెనీల నుంచి దరఖాస్తులను ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) సోమవారం ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు మర్చంట్ బ్యాంకర్లకున్న ఆఖరు తేదీ మార్చి 27. కేంద్ర ఆర్థిక మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే దీపం.. ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్కారీ వాటాల నిర్వహణను పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో.. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకారం 25 శాతం కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధన అమలు కావడం లేదు. దీంతో వచ్చే ఏడాది ఆగస్టు 1నాటికి ఆయా సంస్థల్లో ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే మర్చంట్ బ్యాంకర్లు-సెల్లింగ్ బ్రోకర్లు.. ఏ సంస్థల్లో వాటాలను ఎంతమేర, ఏ ధరకు, ఎప్పుడు అమ్మాలన్నదానిపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నాయి.
ప్రస్తుతం ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రం వాటా 90 శాతానికిపైగానే ఉన్నది. వాటిలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (98.3 శాతం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (96.4 శాతం), యూకో బ్యాంక్ 95.4 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (93.1 శాతం), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (86.5 శాతం) ఉన్నాయి. అలాగే ఆర్థిక సంస్థ ఐఆర్ఎఫ్సీలో 86.36 శాతం, బీమా కంపెనీలైన న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో 85.44 శాతం, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో 82.40 శాతం చొప్పున కేంద్ర ప్రభుత్వానికి వాటాలున్నాయి. కాగా, 2021-22 బడ్జెట్లోనే ఐడీబీఐ బ్యాంక్గాక, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్రం ప్రతిపాదించింది. ఐడీబీఐ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆస్తుల నగదీకరణలో భాగంగా జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ(ఎన్హెచ్ఏఐ) దేశవ్యాప్తంగా 24 రోడ్లను అమ్మకానికి పెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పలు రాష్ర్టాల్లోవున్న ఈ రోడ్లకు సంబంధించి ఆస్తులను అమ్మకం ద్వారా రూ.1,863 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం పలు రాష్ట్రాల్లోవున్న 1,472 కిలోమీటర్ల జాతీయ రహదారులను గుర్తించింది. విక్రయించనున్న రోడ్డు ప్రాజెక్టులలో ఐదు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉండగా, నాలుగు ఝార్ఖండ్, మూడు ఉత్తరప్రదేశ్‌లలో ఉన్నట్లు ఎన్హెచ్ఏఐ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే తెలంగాణతోపాటు బెంగాల్, బీహార్ రాష్ర్టాల్లో రెండేసి చొప్పున రోడ్లు ఉండగా.. ఛత్తీస్‌గఢ్, హార్యానా, గుజరాత్, కర్ణాకట, కేరళ, ఒడిశాల్లో ఒక్కో రోడ్డు ప్రాజెక్టు ఉన్నాయి.