హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను దేశ ఏరోస్పేస్ రాజధానిగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఫికీ తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ కమిటీ సహకారంతో శుక్రవారం సచివాలయంలో రాష్ట్రంలోని ప్రముఖ ఏరోస్పేస్ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో ఆయన మేధోమథనం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఇప్పటికే 30కి పైగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఓఈఎంఎస్లు, వెయ్యికిపైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని తెలిపారు. డీఆర్డీవో, హెచ్ఏఎల్ఎల్, జీఎమ్మార్, టాటా, అదానీ ఎల్బిట్, సాఫ్రాన్, బోయింగ్-టీఏఎస్ఎల్ జేవీ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల విలువ రూ. 28,000 కోట్లకు పైగా ఉందని వెల్లడించారు.