IDBI Bank |కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో కేంద్రం మరో అడుగు ముందుకేసింది. తాజాగా బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియలో ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు కేంద్రం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసక్తి కల బిడ్డర్లను ఆకర్షించే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ షేర్లు కొనుగోలు చేయడంతోపాటు యాజమాన్య హక్కులు పొందిన సంస్థకు కొన్ని పన్ను రాయితీలు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే బిడ్లు దాఖలు చేయడానికి ఇచ్చిన గడువును కేంద్రం పొడిగించింది. బిడ్ గెలుచుకున్నవారికి తాజాగా పన్ను మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. కానీ, ఈ అంశాలపై స్పందించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నిరాకరించారు.
ఫైనల్ బిడ్ దాఖలు చేసిన తర్వాత షేర్ విలువ పెరిగితే.. టేకోవర్ చేసే సంస్థ అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను రాయితీ కల్పించాలని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు చెప్పాయి. కొత్తగా బ్యాంకును టేకోవర్ చేసిన వ్యక్తి లేదా సంస్థను అదనపు పన్ను చెల్లించాలని కోరడం అనుచితం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఫైనాన్సియల్ బిడ్ దాఖలు చేశాక పెరిగిన షేర్‌పై అదనపు పన్ను చెల్లించాల్సి వస్తే 30 శాతం అదనంగా సర్‌చార్జి, సెస్ పే చేయాల్సి ఉంటుందని ఏఎంఆర్‌జీ అండ్ అసొసియేట్స్ పార్టనర్ ఓం రాజ్ పురోహిత్ తెలిపారు.
ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కి కలిపి సుమారు 95 శాతం ఉంది. ఇప్పుడు 60.72 శాతం వాటా ఉపసంహరణకు ఇన్వెస్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. సకాలంలో బిడ్లు దాఖలు కాకపోవడంతో వచ్చేనెల ఏడో తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బిడ్డర్ల నుంచి బిడ్లు వచ్చిన తర్వాత.. సదరు బిడ్డర్లకు అర్హత ఉందా? లేదా? అన్న అంశాలను ఆర్బీఐ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నది.