Airtel on 5G | 5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం భారీ ఫీజు వసూలు చేయొద్దని, తక్కువ ఫీజు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ వసూళ్ల కోసం ఖర్చులు పెంచడానికి బదులు శరవేగంగా తదుపరి తరం టెలీ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ అమల్లోకి తేవడంతో పలు బెనిఫిట్లు ఉన్నాయన్నారు. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక అన్ని రంగాల్లో హెల్త్ కేర్ నుంచి వీడియో ఇంటరాక్షన్ వరకు వివిధ రకాల యాప్‌లు లభ్యం అవుతాయన్నారు.
చౌకధరకు 5జీ స్పెక్ట్రం అందుబాటులోకి తేవాలని, పరిశ్రమపై మోయలేని భారం మోయొద్దని గురువారం టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. 5జీ స్పెక్ట్రంతో వందలాది అంశాల్లో దేశాన్ని అభివృద్ధి చేయొచ్చునని అన్నారు.
స్పెక్ట్రం కొనుగోలుపై డబ్బు ఖర్చు చేయడానికి బదులు 5జీ నెట్‌వర్క్‌ను శరవేగంగా అందరికి అందుబాటులోకి తేవడానికి పెట్టుబడులు పెట్టాలని సర్వీస్ ప్రొవైడర్లకు సునీల్ భారతి మిట్టల్ సూచించారు. తద్వారా హై స్పీడ్ కనెక్టివిటీ సేవలు లభిస్తాయన్నారు. 5జీ సేవలను ప్రారంభిస్తే నెట్‌వర్క్‌లో జాప్యం తగ్గడంతోపాటు హైస్పీడ్, శరవేగంగా సేవలు అందుబాటులోకి రావడంతో దేశం పలు రెట్లు పురోభివృద్ధి సాధిస్తుందన్నారు.