Small Savings | ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ పథకంపై వడ్డీరేటు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకున్నది. డిసెంబర్ త్రైమాసికానికి ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ పథకంపైన ఇంతకుముందు 6.5 శాతం వడ్డీరేటు ఇస్తుండగా, ఇక నుంచి 6.7 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై నాలుగు శాతం, ఏడాది గడువు గల టర్మ్ డిపాజిట్ మీద వడ్డీ 6.9 శాతం యధాతథంగా కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్నది.
రెండేండ్లు, మూడేండ్ల గడువు గల టర్మ్ డిపాజిట్ పథకాలపై ఏడు శాతం, ఐదేండ్ల టర్మ్ డిపాజిట్ పథకంపై 7.5 శాతం కొనసాగుతుంది. ఇక సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ మీద 8.2 శాతం, నెలవారీ ఆదాయం ఖాతా పథకం కింద 7.4, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)పై 7.7 శాతం, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్)పై 7.1 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
115 నెలల్లో మెచ్యూర్ అయ్యే కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)లపై 7.5 శాతం, పాపులర్ బాలికల పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) మీద ఎనిమిది శాతం వడ్డీ కొనసాగుతుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీరేట్లను సవరిస్తుంది.