మొన్న ఎయిర్ ఇండియా.. నిన్న ఎల్ఐసీ.. ఇప్పుడు ఎఫ్ఎస్ఎన్ఎల్.ప్రభుత్వ రంగ సంస్థల్ని
అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న నరేంద్ర మోదీ సర్కారు.. మరో కంపెనీని ప్రైవేటీకరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది.కుదిరితే పూర్తిగా, లేకపోతే వాటాలను విక్రయిస్తున్న కేంద్రం.. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఖజానాను నింపుకోవడంపైనే దృష్టి పెడుతున్నది.
న్యూఢిల్లీ, జూన్ 20: అమ్మకానికి మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిద్ధమవుతున్నది. ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ (ఎఫ్ఎస్ఎన్ఎల్) ప్రైవేటీకరణకు మోదీ సర్కారు ముహూర్తం పెడుతున్నది. ఈ సంస్థ విక్రయానికి సంబంధించి ఇప్పటికే కొనుగోలుదారుల అన్వేషణను మొదలుపెట్టిన కేంద్రానికి ప్రాథమికంగా దరఖాస్తు (బిడ్లు)లు అందాయి. ఎఫ్ఎస్ఎన్ఎల్ను కొంటామని పరిశ్రమలోని వివిధ వర్గాలు ఆసక్తిని చూపిస్తున్నాయని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే సోమవారం తెలియజేశారు. ఈ మేరకు తమకు ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లు వారి నుంచి వచ్చినట్టు చెప్పారు.
తొందర్లోనే ప్రైవేటీకరణ
ఎఫ్ఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం మార్చిలో ఈవోఐలను దీపం ఆహ్వానించింది. నిజానికి మే 5 నాటికే ఈ గడువు ముగిసినప్పటికీ.. దీన్ని ఈ నెల 17 వరకు పొడిగించారు. ఈ క్రమంలో ఈవోఐలను అందుకున్నట్టు దీపం తెలియజేసింది. దీంతో వీటి పరిశీలన ముగిసిన అనంతరం ఈవోఐలను సమర్పించిన వారి నుంచి ఆర్థికపరమైన బిడ్లను ఆహ్వానిస్తామని పాండే ట్విట్టర్లో స్పష్టం చేశారు. తద్వారా త్వరలోనే ఎఫ్ఎస్ఎన్ఎల్ అమ్మకం ఉంటుందన్న సంకేతాలనిచ్చారు.
43 ఏండ్ల చరిత్ర
ఎఫ్ఎస్ఎన్ఎల్కు 43 ఏండ్ల చరిత్ర ఉన్నది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ) లిమిటెడ్‌కు అనుబంధ సంస్థగా పనిచేస్తున్నది. దేశంలో మెటల్ స్క్రాప్ రికవరీ, స్లగ్ హ్యాండ్లింగ్‌లో దిక్సూచిగా ఈ మినీ రత్న హోదా కలిగిన సంస్థ వెలుగొందుతుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా 8 స్టీల్ ప్లాంట్లతో కలిసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ప్రపంచంలోని ఇతర పోటీ సంస్థలతో పోల్చితే ఎఫ్ఎస్ఎన్ఎల్ సరసమైన ధరలకే సేవలందిస్తున్నది.
రూ.65,000 కోట్ల లక్ష్యం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.65,000 కోట్ల నిధులను సమీకరించాలని బీజేపీ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకున్నది. మైనార్టీ వాటాల అమ్మకం ద్వారా ఇప్పటిదాకా రూ.24,544 కోట్లను పొందింది. ఇందులో బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీలో వాటాల విక్ర యం ద్వారా వచ్చినవే రూ.20 వేల కోట్లకుపైగా ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్లలో నమోదైన ఎల్ఐసీ షేర్ల విలువ ఏ స్థాయిలో పడిపోతున్నదో.. మదుపరులు ఎలా నష్టపోతున్నారో.. చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థల అమ్మకాలు సర్వత్రా విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి.