Airports | వచ్చే ఐదేండ్లలో దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు చెప్పారు. భారత్ ఎయిర్ పోర్టుల్లో ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని తెలిపారు. గత పదేండ్లలో దేశంలోని 157 విమానాశ్రయాలతో రెట్టింపు అయ్యాయని చెప్పారు. వచ్చే ఐదేండ్లలో 50 విమానాశ్రయాలు నిర్మిస్తామని, 20 ఏండ్లలో మరో 200 విమానాశ్రయాలు ఏర్పాటవుతాయని వెల్లడించారు.
ఢిల్లీలో గురువారం ఎయిర్ బస్ ఇండియా సౌత్ ఏషియా ప్రధాన కార్యాలయంలో జరిగిన శిక్షణా శిబిరంలో మంత్రి మాట్లాడుతూ దేశీయ ఎయిర్ పోర్ట్ ఎకో సిస్టమ్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఐదేండ్లలో విమాన ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని విమానయనశాఖ కార్యదర్శి వుమ్లున్ మాంగ్ ఔల్నాం పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 220 మిలియన్ల మంది ప్రయాణికులు విమానయానం చేశారన్నారు.