Vodafone Idea | దేశానికి చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (VI)లో వాటా పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కంపెనీ బకాయిపడిన స్పెక్ట్రమ్ వేలం మొత్తాన్ని తన వాటాగా మార్చుకోనున్నది. స్పెక్ట్రమ్ వేలం బకాయిలకు బదులుగా వొడాఫోన్ ఐడియాలో వాటా తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందని.. రూ..36,950 కోట్ల విలువైన షేర్లను కొత్తగా కొనుగోలు చేయాలని నిర్ణయించుకుందని ఆదివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాలో 22.6 శాతం వాటాతో కేంద్రం అతిపెద్ద వాటాదారుగా ఉన్నది.
కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 2021 సంస్కరణ, టెలికాం రంగానికి సపోర్ట్ ప్యాకేజీకి అనుగుణంగా తాత్కాలిక నిషేధం ముగిసిన తర్వాత తిరిగి చెల్లించాల్సిన వాయిదా వేసిన బకాయిలతో సహా స్పెక్ట్రమ్ వేలం బకాయిలను భారత ప్రభుత్వానికి జారీ చేసే ఈక్విటీ షేర్లుగా మార్చాలని నిర్ణయించింది. ఈక్విటీ షేర్లుగా మార్చాల్సిన మొత్తం రూ.36,950 కోట్లు అని ఫైలింగ్‌లో పేర్కొంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో సహా సంబంధిత అధికారుల నుంచి అవసరమైన ఆర్డర్ జారీ చేసిన తర్వాత 30 రోజుల్లోపు రూ.10 ముఖ విలువ కలిగిన రూ.3,695 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.10 ఇష్యూ ధరకు జారీ చేయాలని వోడాఫోన్ ఐడియా (VIL) ఆదేశించినట్లు తెలిపింది. ఈక్విటీ షేర్లజారీ తర్వాత కంపెనీలో కేంద్ర ప్రభుత్వం వాటా ప్రస్తుతం ఉన్న 22.60 శాతం నుంచి 48.99శాతానికి పెరుగనున్నది. ప్రమోటర్లు కంపెనీపై కార్యాచరణ నియంత్రణను కొనసాగిస్తారని ఫైలింగ్‌లో పేర్కొంది.