
LIC IPO | కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ఎప్పుడు ఐపీవోకు వెళుతుందో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీవోకు వెళుతుందని శనివారం మీడియాకు చెప్పారు. ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదిత టైంలైన్లపై జరిగిన ఓ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎల్ఐసీ ఐపీవో టైంలైన్పై జరిగిన సమావేశంలో చర్చించాం, ఇతర అంశాలను పరిస్కరించుకోవాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. దీపంకార్యదర్శి తుహిన్ కాంత పాండే, ఎల్ఐసీ మేనేజ్మెంట్తో సవివరంగా చర్చ జరిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలంటే ఎల్ఐసీ ఐపీవో కేంద్ర ప్రభుత్వానికి కీలకం. ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరులోగా ఎల్ఐసీ ఐపీవోకు వెళుతుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడం గమనార్హం. మార్చిలోగా లిస్టింగ్ చేసేందుకు కేంద్రం ఆసక్తిగా ఉంది.
ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లడం ద్వారా సంస్థ సర్ప్లస్ షేర్, ప్రాఫిట్లను షేర్ హోల్డర్స్ పూల్లోకి బదిలీ చేసే అంశంపై కేంద్రానికి క్లారిటీ రావాల్సి ఉంది. ఇతర బీమా కంపెనీల్లో 10 శాతం, ఎల్ఐసీలో ఐదు శాతం సర్ప్లస్ షేర్, ప్రాఫిట్లను షేర్ హోల్డర్స్ పూల్లోకి బదిలీ చేయొచ్చు. మిగతా అంతా పాలసీదారులకే చెందుతాయి. ఇక ఎల్ఐసీలోకి ఎఫ్డీఐ విధానం అమలుకు ఆ సంస్థ చట్టం ఒప్పుకోదు.