న్యూఢిల్లీ, జనవరి 18: నరేంద్ర మోదీ సర్కార్ మరో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టబోతున్నదా.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఆరు దశాబ్దాల క్రితం రూపొందించిన ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చే దిశగా చర్యలకు ఉపక్రమించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇందుకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టేయోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తున్నది.
రెండో విడత సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈసారి బడ్జెట్ సెషన్లో కొత్త ఆదాయపు పన్నుకు సంబంధించి బిల్లును ప్రవేశపెడుతాం. ఇది పూర్తిగా కొత్త చట్టం. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరించేయోచన లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ముసాయిదాను న్యాయమంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నదని అధికారులు వెల్లడించారు.
ఈ నూతన ఆదాయ పన్ను చట్టం, 1961ని గడిచిన ఆరు నెలలుగా సమీక్షించి చివరకు పాత చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ, నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నారు. ఈ చట్టం ప్రకారం పేజీలను 60 శాతం తగ్గనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను సార్వత్రిక బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి 6,500 మంది సూచనలు ఆధారంగా ఈ నూతన చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు.