న్యూఢిల్లీ, జూలై 13: ప్రభుత్వరంగ టెలికం సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను విలీనం చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తున్నది. కేవలం మహానగర్ టెలిఫోన్ నిగం లిమిటెడ్(ఎంటీఎన్ఎల్)కి చెందిన కార్యకలాపాలను బీఎస్ఎన్ఎన్కు అప్పగించేయోచనలో సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ప్రస్తుతం ఆ దిశగా చర్యలు జరుగుతున్నాయని, దీనికి మరో నెల రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఎంటీఎన్ఎల్ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆ వర్గాలు భావిస్తుండటం వల్లనే కార్యకలాపాలు మాత్రమే మార్చాలని యోచిస్తున్నది.
తొలుత సెక్రటరీల కమిటీ ఈ ప్రతిపాదనను ఉంచిన తర్వాత క్యాబినెట్ ఆమోదానికి పంపిస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 20న ఎంటీఎన్ఎల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధులకు వడ్డీలను చెల్లించాల్సి ఉన్నది. ప్రస్తుతం ఎంటీఎన్ఎల్..ఢిల్లీ, ముంబైలలో మాత్రమే టెలికం సేవలు అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ మిగతా దేశవ్యాప్తంగా అందిస్తున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంటీఎన్ఎల్ రూ.3,267.5 కోట్ల నష్టం వచ్చింది.