హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కునారిల్లుతున్నది. పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులు నుంచి వస్తున్న దరఖాస్తులకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. అనేక నెలలుగా దరఖాస్తులను పరిశీలించే నాథుడే లేకపోవడంతో అవి కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ముందుగా అనుమతుల కోసం టీజీఐఐసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆ పత్రాలన్నీ సవ్యంగా ఉంటే అనుమతులు మంజూరు చేసి, దరఖాస్తుదారులు కోరుకున్న పారిశ్రామికవాడలో నిర్ణీత ధరకు భూమిని కేటాయిస్తారు.
ఇదే క్రమంలో ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ కరుణించేవాడు లేకుండా పోయింది కాంగ్రెస్ సర్కార్ పరిపాలనలో. ఉదాహరణకు నల్గొండకు చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త దండు మల్కాపూర్‌లో ఎంఎస్ఎంఈ యూనిట్ ఏర్పాటుకు గతేడాది ఫిబ్రవరిలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, ఇంతవరకు అతని దరఖాస్తు పరిశీలించిన పాపనపోలేదు. అదే ప్రాంతంలో యూనిట్ ఏర్పాటునకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్న వేరొకరికి మాత్రం వెంటనే అనుమతులు మంజూరయ్యాయి. కరీంనగర్ జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు గత ఏడాది ఆగస్టులో దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తికి ఇంతవరకు అనుమతులు మంజూరు కాలేదు.
దరఖాస్తులో కానీ, అర్హతల్లో కానీ ఎటువంటి లోపాలు లేవు. అయినా ఆయన దరఖాస్తును పరిశీలించిన నాథుడే లేడు. ఇవి మచ్చుకకి ఒకటి రెండు మాత్రమే. టీజీఐఐసీలో ఇటువంటివి తవ్వుతున్నా కొద్ది బయట పడుతున్నాయి. అనుమతుల కోసం దరఖాస్తు చేసేవారు మంత్రిదో, లేక స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధిదో సిఫారసు తీసుకొని వెళ్తే తప్పా అనుమతులు మంజూరయ్యే పరిస్థితి లేదు. పరిశ్రమకు అనుమతి కోరుతూ ఆన్లైన్ ద్వారా నిత్యం పదుల సంఖ్యలో టీజీఐఐసీకి దరఖాస్తులు వస్తాయి.
వాటిని ప్రతివారం అధికారులు పరిశీలించి అందులో అన్నీ సవ్యంగా ఉన్నవాటికి అనుమతులు మంజూరు చేస్తారు. గతంలో ప్రతివారం 50 నుంచి 60 వరకు అనుమతులు మంజూరయ్యేవి. టీఎస్ఐపాస్ చట్టం ద్వారా 2015 నుంచి 2023 వరకు సుమారు 24,241 అనుమతులు మంజూరుచేశారు. ఇందులో తయారీ రంగంలో 21,921 యూనిట్లు కాగా, మిగిలినవి సేవల రంగానికి సంబంధించినవి. దరఖాస్తు చేసుకున్నవారికి టీజీఐఐసీ అధికారులు మెసేజ్ ద్వారా వెంటనే దరఖాస్తు పురోగతి వివరాలు, ఇంటర్యూల వివరాలు అందించేవారు. అనుమతులు సైతం ఆన్లైన్ ద్వారా పొందే వెసులుబాటు కల్పించారు.
కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఆన్లైన్ ద్వారా వస్తున్న దరఖాస్తులను పరిశీలించే నాథుడే కరువయ్యాడు. టీజీఐఐసీ అధికారులు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సిఫారసులు ఉన్నవాటిని మాత్రమే ప్రాసెస్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం 2 వేలకు పైగా దరఖాస్తులు పేరుకుపోయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నరలో మంజూరైన అనుమతులు కేవలం 190 మాత్రమే కావడం గమనార్హం. దీన్నిబట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొందరికి అనుమతులు మంజూరు చేసినప్పటికీ స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అభ్యంతరం చెప్పడంతో వాటిని నిలిపివేశారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు కీసర ప్రాంతంలోని ఓ పారిశ్రామికవాడలో ఒకరికి పరిశ్రమ ఏర్పాటుకు అనుమతించి భూమి కేటాయించగా, సదరు వ్యక్తి భూమి చదును చేసుకునేందుకు వెళ్లగా స్థానికంగా ఉండే ఓ కాంగ్రెస్ నేత పనులు నిలిపివేసినట్లు తెలిపారు. సంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల్లో మంత్రులు, స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అనుమతి లేకుండా ఒక్క అనుమతి కూడా మంజూరు కావడంలేదని చెబుతున్నారు.
ముఖ్యంగా బండ తిమ్మాపూర్, బండ మైలారం, పాశమైలారం, సుల్తాన్పూర్, ఇబ్రహీంపట్నం, భువనగిరి తదితర ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ పార్కుల్లో అనుమతులకు డిమాండ్ అధికంగా ఉందని, అయినా రాజకీయ జోక్యం కారణంగా తాము అర్హతలకు అనుగుణంగా అనుమతులు మంజూరుచేసే అవకాశం లేదని అధికారవర్గాలు వాపోతున్నాయి. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలనుంచి ఫోన్లు చేయించుకున్న వారికి మాత్రమే అనుమతులు ఇస్తున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు.
గత బీఆర్ఎస్ సర్కారు పరిశ్రమల కోసం ప్రభుత్వ భూములు సహా దాదాపు 1.50 లక్షల ఎకరాల ల్యాండ్‌బ్యాంక్‌ను సిద్ధం చేసింది. అంతేకాదు, దాదాపు 156 వరకు ఇండస్ట్రియల్ పార్క్‌లను ఏర్పాటుచేసి దాదాపు 28 వేల ఎకరాలకు పైగా భూములను పరిశ్రమలకోసం కేటాయించింది. ఇంకా చాలా పార్క్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమలకు కేటాయించాల్సి ఉంది. కాగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆ భూములను అభివృద్ధి చేసి పరిశ్రమలకు కేటాయించాల్సింది పోయి ఫ్యూచర్ సిటీ వెంట పరుగులు తీస్తున్నది. దరఖాస్తులు కుప్పతెప్పలుగా పేరుకుపోయినా పట్టించుకోకుండా నగరానికి ఆమడ దూరంలో కొత్త నగరాన్ని అభివృద్ధిచేసి అక్కడే పరిశ్రమలకు భూములిస్తామని చెబుతున్నది. ఫ్యూచర్ సిటీ ఎప్పటికి పూర్తవుతుందో, పరిశ్రమలకు ఎప్పటికి అనుమతులు వస్తాయో అర్థం కావడంలేదని పరిశ్రమవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.
అనుమతించిన పరిశ్రమలు- 190 పెండింగులో ఉన్న దరఖాస్తులు- 2,000 చెప్పుకోదగ్గ పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు వెనక్కిపోయిన భారీ పరిశ్రమలు… కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్, కేన్స్ సెమీకండక్టర్ల పరిశ్రమ గతంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీ రద్దు అమలుకు నోచుకోని 10 ఫార్మా విలేజ్ల ఏర్పాటు
కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ తెచ్చినా విడుదలకాని మార్గదర్శకాలు కొత్త పారిశ్రామిక, ఐటీ పాలసీ పేరుతో కాలయాపన గణనీయంగా తగ్గిన కొత్త పరిశ్రమల నమోదు.
పరిశ్రమలకు అత్యంత వేగవంతంగా అనుమతులు మంజూరు చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో టీఎస్ ఐపాస్ చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశ్రమ పెట్టాలనుకునేవారు సమగ్ర ప్రాజక్టు నివేదిక, పెట్టుబడికి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్, స్థలం లేక షెడ్డు ఉంటే దాని యాజమాన్య/లీజ్ డీడ్ వివరాలు, భవన అనుమతి పత్రాలు తదితర కొన్ని ముఖ్యమైన పత్రాలతో టీజీఐఐసీకి దరఖాస్తు చేస్తే అధికారులు పక్షంరోజుల్లోగా వాటిని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు.
ఒకవేళ దరఖాస్తులో ఏమైనా లోపాలుంటే వాటిని సమర్పించాలని కోరుతూ దరఖాస్తును తిరస్కరిస్తారు. వారు కోరిన విధంగా దరఖాస్తు చేస్తే అనుమతులు మంజూరవుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ విధానం సజావుగా సాగింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానాన్ని, టీజీఐఐసీ అనుమతుల పద్ధతిని పూర్తిగా నీరుగార్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి ఒక్క నెల కూడా దరఖాస్తుల పరిశీలన, అనుమతుల మంజూరీ సజావుగా జరిగిన దాఖలాలు లేవని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు.