న్యూఢిల్లీ, డిసెంబర్ 26: అదానీ గ్రూప్‌లోని గ్రీన్ ఎనర్జీ యూనిట్ 2030వ సంవత్సరానికల్లా 45 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో గౌతమ్ అదానీ కుటుంబం రూ.9,350 కోట్ల తాజా పెట్టుబడులకు సంకల్పించింది. ఈ పెట్టుబడులకు ప్రతిగా గౌతమ్ అదానీకి, ఆయన కుటుంబానికి వారెంట్లు జారీచేసే ప్రతిపాదనకు అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) డైరెక్టర్ల బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది.
ప్రమోటర్ గ్రూప్ సంస్థలైన ఆర్డోర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్, అదానీ ప్రాపర్టీస్‌లకు ఒక్కో వారెంటు రూ.1,480.75 ధరతో 6.31 కోట్ల ప్రిఫరెన్షియల్ వారెంట్లను జారీచేయనున్నట్టు స్టాక్ ఎక్సేంజీలకు కంపెనీ వెల్లడించింది. ఈ వారెంట్లు తదుపరి ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేస్తారు. దీంతో గ్రీన్ ఎనర్జీలో ప్రమోటర్లకు 3.8333 అదనపు ఈక్విటీ వాటా సమకూరుతుంది. తాజా పెట్టుబడులకు మూలధన వ్యయాలకు, రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్టు ఏజీఈఎల్ పేర్కొంది. ఈ వార్త నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు బీఎస్ఈలో 4.3 శాతం పెరిగి రూ. 1,600 వద్ద ముగిసింది.