Google Pixel 9 | గ్లోబల్ టెక్ జెయింట్ గూగుల్ ప్రతిఏటా ‘మేడ్ బై గూగుల్ (Made by Google)’ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఆ ఈవెంట్ మరో 2 వారాల్లో అంటే ఈ నెల 13న ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించనున్నది. అయితే, ఈ ఫోన్ల ఆవిష్కరణ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లలో 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్లపై ఇంట్రడ్యూసరీ ఆఫర్లు తెస్తుందని సమాచారం. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లో గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ 256 స్టోరేజీ వేరియంట్ల ఫోన్లు 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరలకు అందిస్తుందని సమాచారం.
ఈ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి యూ-ట్యూబ్ ప్రీమియం, ఫిట్ బిట్ ఫ్రీమియం సేవలను మూడు నెలలు ఉచితంగా అందించనున్నది గూగుల్. తొలిసారి గూగుల్ పిక్సెల్ ఫోన్ కొన్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లోపు ఫోన్లు కొన్న వారికి ఆరు నెలల గూగుల్ వన్ ప్రీమియం ఆఫర్ లభిస్తుంది. అలాగే గూగుల్ వన్ ఏఐ ప్రీమియం మీద 12 నెలల పాటు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందుకోవచ్చు.
ఫ్రాన్స్‌లో గూగుల్ తన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లపై ప్రమోషనల్ ఆఫర్లు అందిస్తోంది. ఈ నెల 13 నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకూ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లను 128 జీబీ స్టోరేజీ వేరియంట్ల ధరలకే విక్రయించనున్నది గూగుల్. దీంతోపాటు గూగుల్ పిక్సెల్ 9 మీద 150 యూరోలు, గూగుల్ పిక్సెల్ 9 ప్రో – గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ వేరియంట్లపైన 200 యూరోల బోనస్ అందిస్తోంది.
తక్షణ డిస్కౌంట్, ట్రేడ్ ఇన్ బోనస్ అమలు చేస్తే గూగుల్ పిక్సెల్ 9 ధర 999 యూరోల నుంచి 749 యూరోలకు, గూగుల్ పిక్సెల్ 9 ప్రో 256 జీబీ వేరియంట్ ధర 1199 యూరోల నుంచి 899, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ధర 1299 యూరోల నుంచి 999 యూరోలకు తగ్గుతుందని తెలుస్తోంది.