Google Pay | ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్‌లో పాపులర్ యాప్ ‘గూగుల్ పే (Google Pay)’ సేవలు వచ్చేనెల నాలుగో తేదీ నుంచి నిలిచిపోనున్నాయి. పలు దేశాల్లో ‘గూగుల్ పే’ సేవలందిస్తున్నది. భారత్, సింగపూర్ మినహా ఇతర దేశాల్లో ‘గూగుల్ పే’ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని గూగుల్ వెల్లడించింది. దాని స్థానే ‘గూగుల్ వాలెట్’ అందుబాటులోకి వస్తుంది.
‘గూగుల్ పే’ కంటే గూగుల్ వాలెట్’ను అమెరికన్లు ఎక్కువగా వాడుతుండటంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నది. సింగపూర్, భారత్‌ల్లో గూగుల్ పే సేవలు యధాతథంగా కొనసాగుతాయి కనుక గూగుల్ పే యాప్ వాడే భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గూగుల్ పేర్కొంది.
గూగుల్ పే యూజర్లంతా వచ్చే నెల నాలుగో తేదీ నాటికి గూగుల్ వాలెట్‌కు మారిపోవాలని అమెరికన్లను కంపెనీ కోరింది. జూన్ నాలుగో తేదీ వరకూ యూజర్లు గూగుల్ పే సేవలు వినియోగించుకోవచ్చు. గడువు దాటిన తర్వాత అమెరికన్లు మనీ పంపాలన్నా, ఇతరుల నుంచి పొందాలన్నా గూగుల్ పే వినియోగంలో ఉండదు. ప్రస్తుతం గూగుల్ పే స్థానంలో దాదాపు 180 దేశాల్లో గూగుల్ వాలెట్ రీ ప్లేస్ చేసినట్లు తెలుస్తున్నది.