Google | కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెర్చింజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. అమెరికాలోని గూగుల్ ఆఫీసులకు వచ్చేవారు వారానికి ఒకసారి కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి చేసింది. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ చూపిన వారిని గూగుల్ వర్క్సైట్స్ ఆఫీసుల్లోకి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. వారు తప్పనిసరిగా ఆఫీసుల్లో సర్జికల్ మాస్క్లు ధరించాల్సి ఉంటుందని తెలిపింది.
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అమెరికాలోని మా సంస్థ ఆఫీసులకు వచ్చే వారి కోసం తాత్కాలిక హెల్త్, సేఫ్టీ చర్యలుచేపట్టాలని నిర్ణయించినట్లు గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులు, డిపెండెంట్లు, ఇంట్లో ఉండే ఇతరులకు ఇంటి వద్దే ఉచితంగా ఇన్పర్సన్ టెస్టింగ్ ఆప్షన్లు అందిస్తున్నామన్నారు.
తొలుత సిబ్బందిని ఈ నెల నుంచే వర్క్ ఫ్రం ఆఫీసులకు ఆహ్వానించాలని గూగుల్ నిర్ణయించింది. కానీ, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో ఆ నిర్ణయం అమలును వాయిదా వేసింది. 2020లో కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పుడు సిబ్బందిని వర్క్ ఫ్రం హోం సేవలకు అనుమతించిన తొలి సంస్థగా గూగుల్ నిలిచింది.