Google Layoffs | గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ తాజాగా సంస్థలో 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఇందులో మేనేజర్ స్థాయి పోస్టులు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని గూగుల్ వర్గాల కథనం. ఇటీవల అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో ఉద్యోగుల ఉద్వాసన నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ధృవీకరించారు. ఓపెన్ఏఐ మాదిరిగా ఏఐ ఫోకస్డ్ సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని ఆపరేషన్స్ క్రమబద్ధీకరించేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపారు.
రెండేండ్లుగా విస్తృత ప్రాతిపదికన సంస్థ పునర్వ్యవస్థీకరణ వ్యూహంలో భాగంగా గూగుల్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నది. వ్యక్తిగత కంట్రిబ్యూటర్ రోల్స్ వంటి కొన్ని ఉద్యోగాలను పూర్తిగా తొలగిస్తారని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. 2022 సెప్టెంబర్ నెలలో గూగుల్ 20 శాతం మరింత శక్తిమంతంగా మారాలని భావిస్తున్నట్లు అప్పట్లోనే సుందర్ పిచాయ్ చెప్పారు. తదనుగునంగా గతేడాది జనవరిలో 12 వేల మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది. 2024లో 539 టెక్ కంపెనీలు 1,50,034 మంది ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్ డాట్ కామ్ తెలిపింది. గతేడాది 1,193 కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.