Google Chrome Book | గ్లోబల్ టెక్ దిగ్గజం `గూగుల్` భారత్‌లో క్రోమ్‌బుక్ పేరుతో లాప్‌టాప్‌లు తయారు చేస్తున్నది. ఇందుకోసం కంప్యూటర్ల తయారీ సంస్థ `హెచ్‌పీ`తో జత కట్టింది. చెన్నై సమీపాన ఫ్లెక్ ఫెసిలిటీ ప్లాంట్ వద్ద సోమవారం నుంచి క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభమైందని హెచ్‌పీ అధికార ప్రతినిధి తెలిపారు. ఫ్లెక్ ఫెసిలిటీ ప్లాంట్‌లో 2020 ఆగస్టు నుంచి పలు రకాల లాప్‌టాప్‌లు, డెస్క్ టాప్ కంప్యూటర్లను హెచ్‌పీ తయారు చేస్తున్నది.
`భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీకి మేం హెచ్పీతో పార్టనర్షిప్ ఒప్పందం కుదుర్చుకున్నాం. భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ ఇదే తొలిసారి. దీంతో భారతీయ విద్యార్థులకు చౌక ధరకు సురక్షితమైన కంప్యూటింగ్ అవకాశాలు మెరుగవుతాయి` అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ `ఎక్స్ (మాజీ ట్విట్టర్)`లో పోస్ట్ చేశారు. హెచ్‌పీ సాయంతో గూగుల్ తయారు చేసే క్రోమ్‌బుక్ ధర రూ.15,990 నుంచి ప్రారంభమవుతుందని హెచ్‌పీ అధికార ప్రతినిధి చెప్పారు.
ఐటీ, హార్డ్‌వేర్ ఉత్పత్తుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద రూ.17 వేల కోట్ల సబ్సిడీ అందిస్తున్నది. ఈ సబ్సిడీ కోసం హెచ్‌పీ కూడా దరఖాస్తు చేసుకున్నది. 2021 డిసెంబర్ నుంచి హెచ్‌పీ పలు రకాల లాప్‌టాప్‌లు దేశీయంగా తయారు చేస్తున్నది. భారత్‌లోనే హెచ్‌పీ ఎలైట్ బుక్స్, హెచ్‌పీ ప్రో బుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్ బుక్స్ తయారవుతున్నాయి.