Skype | ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ కాలింగ్, వీడియో చాటింగ్‌కు పర్యాయపదంగా మారిన ఈ యాప్ ఇప్పుడు చరిత్రగా మిగులనున్నది. రెండు దశాబ్దాలకుపైగా వీడియో కాలింగ్ సేవలు అందించిన స్కైప్ మూతపడింది. ఇక స్కైప్ స్థానంలో మైక్రోసాఫ్ట్ టీమ్స్ పేరుతో సేవలు అందించబోతున్నది. ఇదిలా ఉండగా.. స్కైప్ కరోనా సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సమయంలో చాలా మంది ఉద్యోగులు, వ్యాపార సంస్థలు స్కైప్ సేవలను పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నారు. ఆ తర్వాత యూజర్ల నుంచి ఆదరణ తగ్గడం, మార్కెట్లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కమ్యూనికేషన్ వేదికలను ఏకీకృతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే స్కైప్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే మే 5 నుంచి స్కైప్ సేవలను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. స్కైప్ యూజర్లను మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని కోరింది. మైక్రోసాఫ్ట్ 2011లో 8.5 బిలియన్లకు స్కైప్‌ను కొనుగోలు చేసింది. స్కైప్ 2003లో ప్రారంభమైంది. నిక్లాస్ జెన్స్ట్రోమ్, జానస్ ఫ్రిస్ దీన్ని రూపొందించారు. ఇది స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. కొద్ది రోజుల్లోనే ప్రజాధరణ పొందింది. 2005లో ఈ-బే 2.6 బిలియన్లకు స్కైప్‌ను కొనుగోలు చేసింది. 2009లో ఈ-బే స్కైప్‌లో 70శాతం వాటాను సిల్వర్ లేక్ పార్టనర్స్ వంటి పెట్టుబడిదారులకు విక్రయించింది. ఆ తర్వాత 2011లో, మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను పూర్తిగా 8.5 బిలియన్లకు కొనుగోలు చేసింది.
స్కైప్ 2003లో ప్రారంభై.. 2011లో మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోకి వచ్చింది. ప్రస్తుతం మెసేజింగ్, వీడియో కాల్స్ వంటి ఇతర సర్వీసుల కోసం మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై దృష్టి పెడుతున్నది. స్కైప్ యూజర్లను సైతం టీమ్స్‌లో చేరాలని కొంతకాలంగా కోరుతూ వస్తున్నది. ఇప్పటికే చాలామంది యూజర్లు టీమ్స్‌కు మారిపోయారు. స్కైప్ కొన్నేళ్లుగా మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికీ జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్ సైతం ఈ సేవలు అందిస్తూ వస్తున్నాయి. ఆఫీస్ 365లో భాగంగా ఉన్న మైక్రోసాఫ్ట్ టీమ్స్ వైపు యూజర్లను నడిపించేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది. స్కైప్ నుంచి టీమ్స్‌కు మారేందుకు మైక్రోసాఫ్ట్ యూజర్లకు సమయం ఇచ్చింది. టీమ్స్‌కు బదిలీ అయ్యేవారి చాట్ హిస్టరీ, కాంటాక్ట్‌లను టీమ్స్‌కు బదిలీ చేస్తామని చెప్పింది.