Gold Rate | ఇటీవల రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు దిగివస్తున్నాయి. వరుసగా ఐదోరోజు పసిడి ధరలు దిగివచ్చాయి. డిమాండ్ పడిపోవడంతో మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 99.9 ప్యూరిటీ గోల్డ్ ధర రూ.200 వరకు తగ్గింది. దాంతో తులం బంగారం ధర రూ.91,250కి తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర సైతం రూ.200 తగ్గి తులానికి 90,800కి చేరుకుంది. మరో వైపు ఇటీవల దిగివచ్చిన వెండి ధరలు మాత్రం మంగళవారం పెరిగాయి. రూ.200 పెరిగి కిలో.. రూ.92.700కి పెరిగింది. విదేశీ మార్కెట్లలో స్పాట్ బంగారం 0.82 శాతం పెరిగి ఔన్సుకు 3,007.60 డాలర్లకు పెరిగింది.
ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ రూపాయి బలహీనత కారణంగా వెండి ధర పెరిగిందన్నారు. పెట్టుబడిదారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని.. డాలర్ ఇండెక్స్ 102 వద్ద స్థిరంగా ఉందన్నారు. ఇది బులియన్ ధరలపై పెద్దగా ప్రభావం చూపలేదన్నారు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లోని సీనియర్ కమోడిటీ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ మార్కెట్లో పాల్గొనే వారంతా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తాజా పాలసీ సమావేశం నిర్ణయాలతో పాటు స్థూల ఆర్థిక డేటా కోసం నిరీక్షిస్తున్నారన్నారు. ఆసియా ట్రేడింగ్ స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.69శాతం పెరిగి 30.29 డాలర్లకు చేరింది. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్స్ గోల్డ్ తులానికి రూ.82,250 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.89,730కి చేరింది. మరో వైపు వెండి ధర కిలోకు రూ.1.03లక్షలు పలుకుతున్నది.