Freshers | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : దేశీయ మార్కెట్లో ఫ్రెషర్లకు మళ్లీ మంచి రోజులొస్తున్నాయి. ఇన్నాళ్లూ కొత్తవారిని దూరం పెడుతూవస్తున్న కంపెనీలు.. తిరిగి వారికి పెద్దపీట వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్‌లో తెలుస్తున్నది. గత ఏడాది ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్)తో పోల్చితే ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో ఫ్రెషర్స్ హైరింగ్‌కు ఆయా కంపెనీలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్టు తాజా నివేదిక చెప్తున్నది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఐటీ రంగానికి వ్యాపారావకాశాలు బాగుంటాయన్న అంచనాలు ఓవైపు.. డీప్-టెక్ ఆధారిత నైపుణ్యాలున్నవారికి క్రమేణా ఆదరణ పెరుగుతుండటం ఇంకోవైపు.. వెరసి ఫ్రెషర్లకు అనుకూల వాతావరణం ఏర్పడుతున్నది.
మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా.. ఉద్యోగుల నైపుణ్యాల్లోనూ మార్పులు వచ్చేస్తున్నాయి. నిత్యనూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వారినే అవకాశాలూ వరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి డీప్-టెక్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ కనిపిస్తున్నది. ఇక జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ల్లో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులు, సర్టిఫైడ్ రోబోటిక్ ఇంజినీర్ కోర్సు, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్, డివోప్స్, హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, ఏఐ అప్లికేషన్స్ తదితర కోర్సులను చేసినవారికి గిరాకీ ఉన్నదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఈ నైపుణ్యాలున్న ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లో నియమించుకోవడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయని, గతంతో పోల్చితే ఫ్రెషర్స్, డిగ్రీ అప్రెంటిక్స్ హైరింగ్పట్ల సంస్థల ఆసక్తి 74 శాతం పెరిగిందని టీమ్‌లీజ్ వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా 649 కంపెనీలు టీమ్‌లీజ్ సర్వేలో పాల్గొన్నాయి.