న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్నాలజీ సహా పలు రంగాలను లేఆఫ్స్ వణికిస్తున్నాయి. అమెజాన్, ట్విట్టర్, మెటా, షేర్‌చాట్, డుంజో, కాయిన్‌బేస్ వంటి ఎన్నో కంపెనీలు ఉద్యోగులను పెద్దసంఖ్యలో తొలగించగా తాజాగా కార్ రిపేర్ స్టార్టప్ గోమెకానిక్ తమ సిబ్బందిలో 70 వాతం మందిపై వేటు వేయనున్నట్టు వెల్లడించింది.
ఖర్చుల్లో కోత విధిస్తూ సంక్లిష్ట పరిస్ధితుల్లో వృద్ధి దిశగా పురోగమించేందుకు లేఆఫ్స్ తప్పడం లేదని కంపెనీ వ్యవస్ధాపక సీఈఓ అమిత్ భాసిన్ పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు బాధాకరమే అయినా వ్యాపార పునర్వ్యవస్ధీకరణలో భాగంగా 70 శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించామని అమిత్ భాసిన్ లింక్డిన్లో రాసుకొచ్చారు.
ఇక బాధిత ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్ వర్తింప చేస్తారా లేదా అనే వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రస్తుత పరిస్ధితికి తామే బాధ్యత వహిస్తామని, మూలధన సమస్యలను పరిష్కరించాల్సి ఉందని అమిత్ చెప్పుకొచ్చారు.