Goldman Sachs | ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ట్విట్టర్.. మెటా.. అమెజాన్ తదితర సంస్థలు భారీగా ఉద్యోగుల ఉద్వాసనకు దిగాయి. ఆ లిస్ట్‌లోకి ప్రపంచంలోనే పేరొందిన గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ `గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ ఇంక్` వచ్చి చేరినట్లు కనిపిస్తున్నది. భారీగా ఉద్యోగులను తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. ఇతర బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలతో పోలిస్తే.. గోల్డ్ మాన్ సాచెస్.. దాదాపు 3,200 మందిని సాగనంపనున్నట్లు వినికిడి.
ఇప్పటికే 200 కోట్లకు పైగా నష్టాలను చవి చూస్తున్న ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్లలోనూ ఉద్యోగాల్లో కోత విధించనున్నది. ఇన్స్టాల్మెంట్-లెండింగ్ బిజినెస్, క్రెడిట్ కార్డు బిజినెస్‌లను కలిపేయాలని చూస్తున్నట్లు సమాచారం. న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న బ్యాంక్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి నిరాకరిస్తున్నట్లు వినికిడి.
గోల్డ్‌మాన్ సాచెస్ సీఈవో డేవిడ్ సాల్మన్ మాట్లాడుతూ 2018 చివరి నుంచి ఇప్పటి వరకు సిబ్బంది 34 శాతం పెరిగారన్నారు. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 49 వేలు దాటింది. ఇటీవలి కాలంలో నాన్ ఫ్రంట్ ఆఫీస్ రోల్స్‌తోపాటు డివిజనల్ హెడ్ కౌంట్ కూడా పెరిగింది. నష్టాల్లో ఉన్నా, ఇప్పటికి కొత్త నియామకాలపై ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో కొత్తగా రెగ్యులర్ అనలిస్ట్ క్లాస్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. కరోనా మహమ్మారి వేళ పనితీరు మెరుగ్గా లేని వారిని కొనసాగిస్తూ వచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి వారందరినీ సాగనంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
గోల్డ్‌మాన్ సాచెస్ లాభాలు 46 శాతం తగ్గాయి. రెవెన్యూ రూపేణా సుమారు 4800 కోట్ల డాలర్ల ఆదాయం లభించింది. ఇంతకుముందు 2008లో లేమాన్ బ్రదర్స్ కుప్పకూలినప్పుడు మూడు వేల మందికి పైగా (మొత్తం సిబ్బందిలో దాదాపు పది శాతం) వదిలించుకున్నది. ఆ తర్వాత భారీగా ఉద్యోగాల్లో కోత విధించాలని గోల్డ్‌మాన్ సాచెస్ నిర్ణయానికి రావడం ఇదే తొలిసారి అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2008 మాంద్యం వేళ ఉద్యోగులను తగ్గించగా, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ వార్షిక బోనస్‌లు వదిలేసుకున్నారు.