న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశీయ మార్కెట్లో ఈ ఏడాది ఆఖరుకల్లా 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం ధర రూ.1.25 లక్షలకు చేరవచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ మంగళవారం అంచనా వేసింది. ఇప్పటికే భారతీయ విపణిలో గోల్డ్ రేట్లు లక్షకు చేరువైన నేపథ్యంలో ఈ అంచనా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఈ డిసెంబర్ నాటికి ఔన్స్ 4,500 డాలర్లు పలుకవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ చెప్తున్నది. ఈ క్రమంలోనే ఇదే గనుక జరిగితే దేశీయంగా తులం రూ.1.25 లక్షలకు చేరడం ఖాయమని అంటున్నది.
వాణిజ్య యుద్ధం ముదిరితే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్స్ కూడా ఇప్పుడిదే చెప్తున్నది. ట్రంప్ ప్రతీకార సుంకాలకు తెరతీయడంతో భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అంతకంతకూ పతనమైపోయాయి. దీంతో మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం పసిడి వైపునకు కదులుతున్నారు. ఫలితంగా మార్కెట్లో ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే టారిఫ్‌ల నుంచి చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజులపాటు విముక్తి లభించడంతో ఈక్విటీ మార్కెట్లు మళ్లీ కోలుకుంటున్నాయి.
కానీ చైనాతో అమెరికా సుంకాల పోరు కొనసాగుతుండటం.. ఇన్వెస్టర్లలో ఆందోళనల్ని తగ్గించలేకపోతున్నది. ఈ నేపథ్యంలోనే పుత్తడి ధరలపై ఈ ఏడాదిలో ఇప్పటిదాకా గోల్డ్‌మన్ సాచ్స్ తమ అంచనాలను మూడుసార్లు సవరించింది. తొలుత ఔన్స్ 3,300 డాలర్లుగా, ఆ తర్వాత 3,700 డాలర్లుగా, ఇప్పుడు 4,500 డాలర్లు అన్నది. ఇక ఆర్థిక మాంద్యం భయాల నడుమ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుతూపోతుండటం కూడా పుత్తడి ధరల్ని అమాంతం పెంచేస్తున్నది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ విలువ 23 శాతం పుంజుకోగా, దేశీయంగా తులం రూ.20 వేలదాకా ఎగిసింది. మంగళవారం తులం 24 క్యారెట్ రూ.96,450ని తాకి మళ్లీ రేట్లు ఆల్‌టైమ్ హైని చేరడం.. గోల్డ్ మార్కెట్ రష్కు నిదర్శనంగా నిలుస్తున్నది.