దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇటీవలి ర్యాలీ బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీలకు గొప్ప లాభాలనే అందించింది. ఒక్క వారంలోనే సుమారుగా సెన్సెక్స్ 4.35 శాతం, నిఫ్టీ 4.45 శాతం చొప్పున ఎగిశాయి మరి. అయితే ఇన్వెస్టర్స్ పోర్ట్‌ఫోలియోలో బంగారం, వెండికి ప్రత్యామ్నాయంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులను ఎంచుకోవడానికి లేదా పెంచుకోవడానికి ఇది చాలదు. ఎందుకంటే ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా అంటే జనవరి-మార్చిలో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండూ ఇంచుమించుగా 1 శాతం, 0.60 శాతం చొప్పున పడిపోయాయి.
ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు దాదాపు 17 శాతం, 15 శాతం మేర పెరిగాయి. ఇంకా లోతుగా చెప్పాలంటే జనవరి 1న సెన్సెక్స్ 78,139.01 పాయింట్ల వద్ద మొదలైంది. ఇప్పుడిది 77,414.92 పాయింట్ల వద్ద ఉన్నది. అలాగే నిఫ్టీ 23,644.80 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం 23,519.35 పాయింట్ల వద్ద నిలిచింది. ఫలితంగా సెన్సెక్స్ 724.09 పాయింట్లు, నిఫ్టీ 125.45 పాయింట్లు కోల్పోయినైట్టెంది. కానీ బంగారం ధర రూ.78,950 నుంచి రూ.92,150కి ఎగబాకింది. వెండి ధర రూ.89,700 నుంచి రూ.1,03,000లకు చేరింది. దీంతో గోల్డ్, సిల్వర్ రేట్లు గడిచిన 3 నెలల్లో రూ.13,200, రూ.13,300 చొప్పున ఎగిసినైట్టెంది.
పైన చెప్పుకున్న లెక్కలన్నీ స్వల్పకాలిక పెట్టుబడి ఆధారిత గణాంకాలే. కానీ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది దీర్ఘకాలిక పెట్టుబడికి ఏది ఉత్తమం? అన్నదే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పెంపు హెచ్చరికలు.. భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చాయి. దీంతో మెజారిటీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణార్థం బంగారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాలు స్టాక్ మార్కెట్ సూచీలను దిగువకు, గోల్డ్, సిల్వర్ సూచీలను ఎగువకు పంపాయి. ఇక భారత్ విషయానికొస్తే.. బంగారాన్ని సురక్షిత మదుపు సాధనంగా భావిస్తుంటే, బ్రాడర్ ఈక్విటీ మార్కెట్‌కు, దేశ ఆర్థిక ప్రగతికి నిఫ్టీనే ప్రాతిపదికగా తీసుకుంటారు. కాబట్టి మదుపరుల పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ అనేవి ఇక్కడ కీలకం అని గుర్తుంచుకోవాలి. వాటి ప్రకారం..
గడిచిన రెండు దశాబ్దాల్లో దేశీయంగా మదుపరులకు బంగారంపై పెట్టుబడులు 8-10 శాతం మేర చక్ర వార్షిక వృద్ధిరేటును అందించాయి. అనిశ్చిత పరిస్థితుల్లోనూ పసిడిపై మదుపు ఆకర్షణీయ ప్రదర్శననే ఇచ్చింది. అయితే దీర్ఘకాలంలో నిఫ్టీలో పెట్టుబడులు 12-15 శాతం వరకు చక్ర వార్షిక వృద్ధిరేటును చూపాయి. దీంతో వృద్ధికే మీ ప్రాధాన్యత అయితే నిఫ్టీ పెట్టుబడులే లాభదాయకం.
ద్రవ్యోల్బణాన్ని అధిగమించాలంటే బంగారం చక్కని సాధనం. కరెన్సీ విలువ తగ్గితే ఇది పెరుగుతుంది. ఇక స్టాక్ మార్కెట్లు సైతం ద్రవ్యోల్బణాన్ని మించి పరుగులు పెడుతున్నాయి. కంపెనీల లాభాలు, ఆదాయం గణనీయంగా పెరుగుతుండటంతో నిఫ్టీదే పైచేయి.
పుత్తడి ధరల్లో ఒడిదుడుకులు తక్కువే. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల ప్రభావం పెద్దగా ఉండదు. స్టాక్ మార్కెట్లపై ప్రతీ చిన్నదాని ప్రభావం కనిపిస్తుంది. అయినా త్వరగా కోలుకుంటాయి. స్థిరత్వాన్ని కోరుకునే మదుపరులకు బంగారమే ఉత్తమం. అయితే ఒడిదుడుకులను తట్టుకుని, ఓపిగ్గా ఎదురుచూస్తే నిఫ్టీ లాభం.
భౌతిక బంగారాన్ని నగదుగా మార్చుకోవడం కొంత ఇబ్బంది. నాణ్యత, తయారీ ఇతరత్రా ఖర్చులు ఎదురవుతాయి. డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఈ సమస్య ఉండదు. స్టాక్ మార్కెట్లలో షేర్ల క్రయవిక్రయాలు సులభం. నగదు లభ్యత వేగంగానే ఉంటుంది. కాబట్టి పసిడి కంటే నిఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్నే త్వరగా క్యాష్ చేసుకోవచ్చు.
బంగారం ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో రిస్క్‌ను తగ్గిస్తుంది. కానీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో ఉంటాయి. అయితే దీర్ఘకాల పెట్టుబడులకు ఈక్విటీలే సరైనవని మెజారిటీ ఎక్స్పర్ట్స్ మాట.
మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులనుబట్టి తమ పోర్ట్‌ఫోలియోల్లో స్థిరత్వాన్ని కోరుకునే భారతీయ మదుపరులకు బంగారంపై పెట్టుబడులే ఉత్తమం. అయితే పోర్ట్‌ఫోలియోల్లో వేగవంతమైన వృద్ధిని కోరుకునే ఇన్వెస్టర్లకు ఈక్విటీలే నయం. అయితే నిపుణుల సలహాతో ముందుకెళ్తే మరింత లాభదాయకం.