Gold – Silver Rates | దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండటంతో బులియన్ మార్కెట్లో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.950 తగ్గి రూ.71,050లకు పరిమితమైంది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం 99.9 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.72 వేలు పలికింది. అలాగే 99.5 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1650 తగ్గి రూ.70,700లకు చేరుకున్నది. శనివారం నాడు రూ.72,350 వద్ద స్థిర పడింది. ఇక కిలో వెండి ధర రూ.4500 తగ్గి రూ.84,500లకు పరిమితమైంది. శనివారం కిలో వెండి ధర రూ.89 వేలు పలికింది.
బంగారం ధరలు తగ్గడంతో జ్యువెల్లర్స్ నుంచి డిమాండ్ తగ్గిందని ట్రేడర్లు చెబుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బంగారంపై దిగుమతి సుంకం 15 నుంచి ఆరు శాతానికి తగ్గించినప్పటి నుంచి దేశీయ బులియన్ మార్కె్ట్లో గత దశాబ్ది కాలంలోనే బంగారం కొనుగోళ్లు పెరిగాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమోడిటీ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోదీ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ‘కామెక్స్ గోల్డ్’లో ఔన్స్ బంగారం ధర 10.60 డాలర్లు వృద్ధి చెంది 2438.50 డాలర్లు పలికింది. సెప్టెంబర్ లో యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గించేందుకు సానుకూల వాతావరణం నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. మంగళ, బుధవారాల్లో జరిగే యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంపైనే ఇన్వెస్టర్లు, విశ్లేషకులు, బులియన్ మార్కెట్ వర్గాల దృష్టి కేంద్రీకృతమై ఉంది.