Gold Rates | అంతర్జాతీయంగా బలహీన ధోరణులు నెలకొనడంతో దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,150 పతనమై రూ.88,200లకు చేరుకుంది. 99.5 శాతం స్వచ్చత గల తులం బంగారం ధర రూ.1,150 తగ్గి రూ.87,800 పలికింది. బుధవారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం రూ.89,350, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.88,950 వద్ద స్థిర పడ్డాయి. గురువారం కిలో వెండి ధర రూ.1,000 క్షీణించి రూ.98,500లకు పతనమైంది. బుధవారం కిలో వెండి ధర రూ.99,500 వద్ద ముగిసింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఏప్రిల్ డెలివరీ తులం ధర రూ. 554 పతనమై రూ.85,320లకు చేరుకుంది. “ఎంసీఎక్స్‌లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో బంగారం ధరలు బలహీన పడ్డాయి. ఫలితంగా తులం బంగారం ధర రూ. 85,000లకు పడిపోయింది. మున్ముందు రూ.84,800 స్థాయికి కూడా పతనం కావచ్చు’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమొడిటీ అండ్ కరెన్సీ, వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 23.10 డాలర్లు తగ్గి 2,907.50 డాలర్లకు పడిపోయింది. మరోవైపు స్పాట్ గోల్డ్ ఔన్స్ బంగారం ధర 2,900 డాలర్ల దిగువన 2,892.95 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ రెండో తేదీ నుంచి మెక్సికో, కెనడాలపై అమెరికా దిగుమతి సుంకాలు 25 శాతం పెరుగనున్న నేపథ్యంలో బంగారం, వెండిలకు ఇన్వెస్టర్ల నుంచి గిరాకీ పెరుగనున్నది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 32.47 డాలర్లుగా ఉంది.