Gold Rates | అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారంపై ఇన్వెస్టర్లందరూ దృష్టిని కేంద్రీకరించారు. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,000 వద్ద ఫ్లాట్‌గా ఉంది. శుక్రవారం బులియన్ మార్కెట్లో రూ.700 వృద్ధితో రూ.82,000లకు చేరుకుంది. 99.5శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.81,600 వద్ద ఫ్లాట్‌గా కొనసాగింది. గతేడాది అక్టోబర్ 31న 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,400లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. దాంతోపాటు 99.5శాతం స్వచ్ఛత గల బంగారం పది గ్రాములు ధర రూ.82 వేలు పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.500 పతనమై రూ.93,000 వద్ద నిలిచింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.93,500వద్ద ముగిసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం బంగారం ధర రూ.62 తగ్గి రూ.78,961లకు చేరుకుంది. మరోవైపు కిలో వెండి మార్చి కాంట్రాక్స్ ధర రూ.202 పతనమై రూ.91,400 వద్ద స్థిర పడింది.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 0.09 శాతం తగ్గి 2,746.30 డాలర్లు పలికింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయనున్న నేపథ్యంలో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో బంగారం ధర 2750 డాలర్ల దిగువన ట్రేడయిందని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. మరోవైపు, సిల్వర్ కామెక్స్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 0.13శాతం పతనంతో 31.10 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో జనవరి నెలలో బంగారం ధర మూడు శాతానికి పైగా, వెండి ఏడు శాతానికి పైగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ బలహీన పడినా, యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గించినా బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.