Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లలో మళ్లీ బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,100 పెరిగింది. వరుసగా రెండో రోజు ధర పెరగడంతో బంగారం తులం ధర రూ.80 వేల మార్క్ దాటేసింది. జ్యువెల్లరీ సంస్థలు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించడంతో శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.80,400 పలికింది. పెండ్లిండ్ల సీజన్ కావడంతో బంగారానికి గిరాకీ పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. గురువారం తులం బంగారం ధర రూ.79,300 పలికింది. మరోవైపు శుక్రవారం కిలో వెండి ధర రూ.300 వృద్ధితో రూ.93,300లకు చేరుకున్నది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,100 పెరిగి రూ.80 వేలు పలికింది. గురువారం 99.5 శాతం స్వచ్చత బంగారం ధర రూ.78,900 వద్ద స్థిర పడింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం డిసెంబర్ డెలివరీ ధర రూ.906 వృద్ధి చెంది రూ.77,599 పలికింది. వెండి కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ ధర రూ.996 పెరిగి రూ.90,921లకు చేరింది. ఇంక అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ బంగారం ధర 36 డాలర్లు పెరిగి 2735.30 డాలర్లు పలికింది. ఇక ఔన్స్ వెండి సైతం 1.42 శాతం పుంజుకుని 31.83 డాలర్లకు చేరుకున్నది.