బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి.
మునుపెన్నడూ లేని రికార్డు స్థాయిలను అధిరోహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో సరికొత్త శిఖరాన్ని పుత్తడి విలువ చేరింది.
దీపావళి తెచ్చిన ఉత్సాహమో.. స్టాక్ మార్కెట్లలో నష్టాల భయమో.. కారణం ఏదైనా దేశీయ విపణిలో తులం రేటు తొలిసారి రూ.82,000 మార్కును దాటేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: బంగారం ధరలు దేశీయంగా మరో ఆల్‌టైమ్ హైని నెలకొల్పాయి. బుధవారం 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన గోల్డ్ రేటు 10 గ్రాములు న్యూఢిల్లీలో తొలిసారి రూ.82,000 మార్కుకు ఎగువన నమోదైంది. మంగళవారం ముగింపుతో పోల్చితే ఒక్కరోజే ఏకంగా రూ.1,000 ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా రూ.82,400 స్థాయిని చేరింది. దీపావళి సందర్భంగా ఆభరణాల వర్తకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడమే ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ పసిడి ధర తులం రూ.81,160గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పుత్తడి రూ.74,400 పలుకుతున్నది. మంగళవారంతో చూస్తే వరుసగా రూ.710, రూ.650 చొప్పున ఎగిశాయి. కాగా, ఈసారి ధనత్రయోదశి అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగడానికి అధిక ధరలే కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రేట్లు ఒక్కరోజే ఇంతలా పెరగడం.. కొనుగోళ్లను ఇంకా తగ్గిస్తాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. నిజానికి గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరలు 35 శాతం పెరిగాయి. నిరుడు అక్టోబర్ 29న 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.61,200గా ఉన్నది. దీంతో రూ.21,200 పెరిగినైట్టెంది.
వెండి ధరలూ పరుగులు పెట్టాయి. ఈ ఒక్కరోజే రూ.1,300 పుంజుకొని కిలో ధర రూ.1.01 లక్షల వద్ద నిలిచింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి విలువ గత బుధవారం మొదటిసారి రూ.1.02 లక్షలు పలికిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే గత ఏడాది అక్టోబర్ 29న కిలో వెండి రేటు రూ.74,000గా ఉన్నది. దీంతో గడిచిన ఏడాది కాలంలో రూ.27,000 పెరిగినైట్టెంది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 16.80 డాలర్లు పెరిగి 2,797.90 డాలర్లను తాకింది. వెండి 34.45 డాలర్లు పలుకుతున్నది.
పండుగ సీజన్ కావడంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీనికితోడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారన్న అంచనాలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలను ఎగదోస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో సాగుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షిత సాధనాల్లోకి మళ్లిస్తుండటం కూడా పసిడికి మరింత డిమాండ్‌ను తీసుకొచ్చింది. స్థానిక జ్యుయెల్లర్స్ నుంచి కొనుగోళ్లు పెరగడం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలూ ధరలకు రెక్కల్ని తొడుగుతున్నాయి.
-జతిన్ త్రివేది, ఎల్కేపీ సెక్యూరిటీస్
ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం