Gold Rates | అంతర్జాతీయంగా బలహీన ధోరణి, దేశీయ బులియన్ వ్యాపారుల నుంచి తగ్గిన గిరాకీ నేపథ్యంలో శుక్రవారం బంగారం ధర పతనమైంది. ఆరు రోజుల దూకుడుకు బ్రేక్ పడింది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.750 తగ్గి, రూ.75,650లకు పతనమైంది. గురువారం ట్రేడింగ్ లో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) రూ.76,400 పలికిన సంగతి తెలిసిందే. 99.5 ప్యూరిటీ బంగారం తులం ధర రూ.800 పతనంతో రూ.75,300లకు పరిమిమైంది. గురువారం 99.5 ప్యూరిటీ బంగారం తులం ధర రూ.76,100 పలికింది. మరోవైపు శుక్రవారం కిలో వెండి ధర సైతం రూ.1000 పతనమైంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.93 వేలు పలికింది. గురువారం కిలో వెండి ధర రూ.94 వేలు పలికింది.
అంతర్జాతీయంగా బలహీన ధోరణులు, దేశీయంగా బులియన్ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం వల్లే బంగారం ధరలు తగ్గాయని విశ్లేషకులు చెప్పారు. శుక్రవారం కామెక్స్ గోల్డ్ లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్పై 41.80 డాలర్లు పతనమై 2,414.60 డాలర్లకు చేరుకున్నది. కామెక్స్ గోల్డ్ లో బంగారం ధరలు తగ్గడం వరుసగా మూడో రోజు. నాలుగు నెలల కనిష్ట స్థాయి నుంచి యూఎస్ డాలర్ పుంజుకోవడంతోపాటు పదేండ్ల యూఎస్ ట్రెజరీ బాండ్లు పుంజుకోవడంతో బంగారంపై సెంటిమెంట్ బలహీన పడినట్లు తెలుస్తున్నది. చైనాతో టారిఫ్ వార్ తోపాటు భౌగోళిక సవాళ్ల నేపథ్యంలో జీవిత కాల గరిష్టానికి చేరుకున్న బంగారంపై పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పుత్తడి ధర తగ్గినట్లు తెలుస్తున్నది.
స్విట్జర్లాండ్ నుంచి బంగారం ఎగుమతులు గత నెలలో పతనం అయ్యాయి. 2022 ఏప్రిల్ నుంచి చైనా, భారత్ లకు బంగారం దిగుమతులు తగ్గడం ఇదే తొలిసారి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర పతనమై 29.32 డాలర్లకు చేరుకున్నాయి. వరుసగా రెండో రోజు యూఎస్ డాలర్ పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.