Gold Rates | వరుసగా రెండో సెషన్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,150 క్షీణించి రూ.78,350లకు చేరుకున్నది. శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.79,500 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,150 నష్టంతో రూ.77,950 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో కిలో వెండి ధర రూ.4,500 తగ్గితే, తాజాగా సోమవారం రూ.300 పతనమై రూ.92,500లకు చేరుకున్నది. శుక్రవారం కిలో వెండి ధర రూ.92,800 వద్ద స్థిర పడింది. మార్కెట్లో అనిశ్చితికి తోడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.143 పతనమై రూ.77,279లకు చేరుకున్నది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో తులం బంగారం ధర రూ.76,904-రూ.77,295 మధ్య తచ్చాడింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.319 పెరిగి రూ.91,320 వద్ద నిలిచింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం 2.70 డాలర్లు వృద్ధి చెంది, 2,678.50 డాలర్లు పలికింది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 31.11 డాలర్ల వద్ద స్థిర పడింది.