Gold Rates | ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో గిరాకీ పెరగడంతో బంగారం, వెండి ధరలు తిరిగి పుంజుకున్నాయి. దీంతో గురువారం తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.200 వృద్ధి చెంది తిరిగి జీవిత కాల గరిష్టం రూ.78,300లకు చేరుకున్నది. మంగళవారం పది గ్రాముల బంగారం రూ.78,100 వద్ద ముగిసింది. మరోవైపు గురువారం కిలో వెండి ధర రూ.665 వృద్ధి చెంది రూ.93,165 వద్ద నిలిచింది. మంగళవారం కిలో వెండి ధర రూ.92,500 వద్ద స్థిర పడింది. గురువారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 పుంజుకుని రూ.77,900 వద్ద ముగిస్తే మంగళవారం రూ.77,700 వద్ద స్థిర పడింది.
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం బులియన్ మార్కెట్లకు సెలవు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ తులం బంగారం ధర రూ.440 తగ్గి రూ.75,950 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.225 పెరిగి రూ.91,600 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర 0.17 శాతం పతనమై 2665.20 డాలర్లు, ఔన్స్ వెండి 0.36 శాతం క్షీణించి 31.81 డాలర్లకు చేరుకున్నది.