Gold Rates |అంతర్జాతీయ పరిస్థితులకు తోడు పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం కావడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ ఎక్కువైంది. ఫలితంగా బంగారం, వెండి ధరలు పుంజుకుంటున్నాయి. వరుసగా నాలుగు రోజుల పతనాన్ని బ్రేక్ చేస్తూ సోమవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) రూ.400 వృద్ధి చెంది రూ.77,450లకు చేరుకున్నది. గురువారం రూ.77,050 పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,810 వృద్ధి చెంది రూ.92 వేల మార్కు దాటింది. గురువారం కిలో వెండి ధర రూ.90,190 వద్ద స్థిర పడింది. గురునానక్ జయంతి సందర్భంగా దేశీయ బులియన్ మార్కెట్లకు శుక్రవారం సెలవు.
మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం బంగారం ధర రూ.621 వృద్ధి చెంది రూ.74,567 పలికింది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.879 పుంజుకుని రూ.89,300లకు చేరుకున్నది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 25.20 డాలర్లు వృద్ధి చెంది రూ.2,595.30 డాలర్లకు చేరుకున్నది. ఔన్స్ వెండి ధర 1.23 శాతం పెరిగి 30.81 డాలర్లకు చేరుకున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత బిట్ కాయిన్, యూఎస్ డాలర్ విలువ పుంజుకోవడంతో బంగారానికి గిరాకీ తగ్గింది.