Gold Rates | జ్యువెల్లర్లు, కొనుగోలు దారుల నుంచి గిరాకీ రావడంతోపాటు జోరుగా విక్రయాలు సాగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కరోజే భారీగా తగ్గుముఖం పట్టాయి. మళ్లీ తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.80 వేల దిగువకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణి కూడా దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడానికి మరో కారణంగా ఉంది. శుక్రవారం 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1,400 తగ్గి రూ.79,500లకు పడిపోయింది. గురువారం తులం బంగారం ధర రూ.80,900 వద్ద స్థిర పడింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.4,200 పతనమై రూ.92,800 వద్దకు పడిపోయింది. డిసెంబర్ నెలలో భారీగా వెండి ధర పతనం కావడం ఇదే మొదటిసారి. గురువారం కిలో వెండి ధర రూ.97,000 పలికింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,400 పతనమై రూ.79,100 లకు చేరుకున్నది. గురువారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.80,500 పలికింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.539 తగ్గి రూ.77,430లకు చేరుకుంది. మార్చి డెలివరీ కిలో వెండి ధర రూ.1,104 పతనమై రూ.91,529 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 18.60 డాలర్లు నష్టపోయి 2690.80 డాలర్లు పలికింది. కామెక్స్ సిల్వర్‌లో ఔన్స్ వెండి ధర 1.42 శాతం పతనంతో 31.17 డాలర్లు పలికింది.