Gold-Silver Price | కొనుగోలుదారులకు పసిడి ధరలు ఊరటనిచ్చాయి. ఇటీవల భారీగా పెరిగిన పుత్తడి ధరలు శాంతిస్తున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి.. రూ.90,550 తగ్గింది. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌తో యూఎస్ అధికారుల మధ్య ఆదివారం చర్చలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. దాంతో రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందం జరుగనుందనే ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా మూడోరోజు బంగారం ధరలు దిగివచ్చాయి. సోమవారం 99.5శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ.700 తగ్గడంతో తులం ధర రూ.90,100కి తగ్గింది. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే అంశంపై ఉక్రెయిన్, అమెరికాతో చర్చల తర్వాత ఆదివారం పసిడి ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. అయితే, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి.
గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులను తిరిగి మొదలుపెట్టడంతో బంగారానికి డిమాండ్ కొసాగుతుందని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా తెలిపారు. అయితే, పసిడి ధరలు పతనమవుతున్నా.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించనుందన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధర పెరుగుతూనే ఉంటుందని మెహతా పేర్కొన్నారు. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.22శాతం పెరిగి ఔన్సుకు 3,028.90 డాలర్లకు చేరింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లోని సీనియర్ కమోడిటీ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. యూఎస్ స్థూల ఆర్థిక డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఎస్అండ్పీ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐ తాత్కాలిక డేటా, ఫెడ్ సభ్యుడు రాఫెల్ బోస్టిక్ ప్రసంగాన్ని సైతం నిశితంగా గమనించనున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.89,620 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,150 పలుకుతున్నది. ఇక వెండి కిలోకు రూ.1.10లక్షలుగా ఉన్నది.