Gold Price | పసిడి ధర కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నది. ఇటీవల ఎన్నడూ లేనివిధంగా సరికొత్త గరిష్ఠాలకు చేరుతున్నది. ఇప్పటికే సరికొత్త రికార్డులను తాకిన పసిడి ధర తొలిసారిగా.. ఆల్టైమ్కి చేరుకుంది. తాజాగా తులానికి రూ.91వేలు దాటి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 99.9 ప్యూరిటీ గోల్డ్ మంగళవారం రూ.500 పెరిగి తులానికి రూ.91,250కి చేరింది. అలాగే, 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర రూ.450 పెరిగి.. తులానికి రూ.90,800 చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించబోతుందన్న అంచనాల మధ్య నిర్ణయాల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు అమెరికా, యెమెన్‌లోని హౌతీ తిరుగబాటుల మధ్య యుద్ధం సాగుతున్నది. ఈ క్రమంలో మధ్యప్రాచ్యంలో రాజకీయ అస్థిరత నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఓ వైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నది. అయినా, రికార్డు స్థాయిలో కిలోకు రూ.1,02,500 పలుకున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ఫ్యూచర్స్ ధరలు 10 గ్రాములకు రూ.649 పెరిగి రూ.88,672కి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3,028.49 డాలర్లకు చేరుకొని రికార్డు స్థాయికి చేరింది. కామెక్స్‌లో బంగారం ఔన్సుకు 3,037.26 డాలర్ల వద్ద రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నది. త్వరలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశం కానున్నది. ఇందులో వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఫెడ్ రిజర్వ్ నిర్ణయం బంగారం ధరను మరింత ప్రభావితం చేయనుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయిస్తే మాత్రం బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని పేర్కొంటున్నారు. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చైనా భారీగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నది. అలాగే, పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం భారీగా బంగారాన్ని కొంటున్నాయి. ఈ క్రమంలో ధరలు సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధర సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకునే అవకాశం ఉన్నది.