Gold-Silver Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నిలకడగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో పుత్తడి ధర పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారంపై రూ.200 తగ్గి తులానికి రూ.79,100కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. గత మూడురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం బుధవారం రూ.500 పెరిగి.. కిలో ధర రూ.92వేలకు ఎగిసింది. ప్రస్తుతం బంగారం విషయంలో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నది. అయితే, ఈ సారి వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడుల విషయంలో అప్రమత్తం వ్యవహరిస్తున్నారు. ఎంసీఎక్స్‌లో గోల్డ్ రేటు రూ.74 పెరిగి.. పది గ్రాముల ధర రూ.76,945కి చేరుకుంది. ఫెడ్ రిజర్వ్ నిర్ణయంపై బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇక వెండి ధర ఎంసీఎక్స్‌లో కిలోకు రూ.90,830కి చేరింది. ఆసియా ట్రేడింగ్ సెషన్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్ 0.08శాతం పెరిగి ఔన్స్‌కు 2,664.10 డాలర్లకు చేరుకుంది.
యూఎస్ రిటైల్ సేల్స్ ఊహించినదాని కంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో వెండి ఔన్స్‌కు 30.92 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నది. ఇక దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.77,840 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ.71,350 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.77,840 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ రూ.71,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,840 పలుకుతున్నది.