Gold Rate | పసిడి ధరలు ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం ధర పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ప్రపంచ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో ధర దిగివచ్చింది. బుధవారం రాజధాని ఢిల్లీలో బంగారం 24 క్యారెట్ల ధర రూ.700 తగ్గి తులానికి రూ.98,420కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.600 తగ్గి తులానికి రూ.98వేలకు తగ్గింది. అదే సమయంలో వెండి ధర కిలోగ్రాముకు రూ.800 తగ్గి రూ.1,04,000కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. జులైలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు తగ్గడం, యూఎస్ డాలర్ బలోపేతం కావడంతో బుధవారం బంగారం ధరలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు.
యూఎస్ డాలర్ బలంగా ఉందని తెలిపారు. రెండు వారాల గరిష్ట స్థాయికి దగ్గరగా ట్రేడవుతోందని.. యూఎస్ లేబర్ మార్కెట్ కారణంగా ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉన్నందున ఫెడ్ అధిక వడ్డీ రేట్లను కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం ధర ఔన్సుకు 11.66 డాలర్లు తగ్గి.. 3,289.81 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 1 టారిఫ్ గడువును పొడిగించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నిరాకరించారు. ఔషధాలపై 200 శాతం సుంకం వంటి భారీ చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. సుంకాలతో యూఎస్ ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.