Gold Rates | దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.200 వృద్ధితో రూ.81,300లకు చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లోనూ స్థానిక జ్యువెల్లర్లు, రిటైల్ వ్యాపారులకు గిరాకీ ఎక్కువైనందు వల్లే బంగారం ధర వృద్ధి చెందిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. సోమవారం ఒక్కరోజే తులం బంగారం ధర రూ.1300 తగ్గి రూ.81,100లకు చేరుకున్నది. 99.5 స్వచ్ఛత గల బంగారం తులం ధర మంగళవారం రూ.200 పెరిగి రూ.80,900లకు చేరింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.1,800 పెరిగి రూ.96,700లకు చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ.94,900 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ రూ.18 తగ్గి రూ.78,404లకు చేరుకున్నది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.239 పుంజుకుని రూ.94,523 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ బంగారం ధర 1.50 డాలర్లు పెరిగి 2747.70 డాలర్లకు చేరుకున్నది. గతవారం ఔన్స్ బంగారం ధర 2,801.80 డాలర్లతో ఆల్ టైం రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ లో ఔన్స్ వెండి ధర 0.37 శాతం పుంజుకుని 32.73 డాలర్లు పలికింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు సాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తున్నారు. మరోవైపు ఈ నెల ఏడో తేదీన యూఎస్ ఫెడ్ రిజర్వ్ కూడా వడ్డీరేట్ల తగ్గింపుపై నిర్ణయం ప్రకటన ఆధారంగా బంగారం ధరలు ప్రభావితం కానున్నాయి.