Gold- Silver Rates | సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.200 వృద్ధి చెంది రూ.72,350లకు చేరుకున్నది. మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.1000 పెరిగింది. ఇంతకుముందు శనివారం సెషన్ లో తులం బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.72,150 వద్ద నిలిచింది. శనివారం కిలో వెండి ధర రూ.82,500 పలుకగా, సోమవారం రూ.83,500లకు పెరిగింది. మరోవైపు తులం బంగారం (99.5 శాతం స్వచ్ఛత) ధర రూ.200 పెరిగి రూ.72 వేల వద్ద స్థిర పడింది.
అంతర్జాతీయ మార్కెట్ తోపాటు స్థానిక బులియన్ మార్కెట్లో ఆభరణాలకు గిరాకీ పెరగడం వల్లే బంగారం ధర పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఔన్స్ ధర 8.40 డాలర్లు వృద్ధి చెంది 2,481.80 డాలర్లు పలికింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు బంగారం తమ పెట్టుబడులకు స్వర్గధామంగా పరిగణిస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ మాక్రో డేటా బలహీన పడటంతో ఈ ఏడాది వడ్డీరేట్లను యూఎస్ ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తుందన్న అంచనాల మధ్య బంగారానికి డిమాండ్ పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 28.01 డాలర్లకు పెరిగింది.