Gold- Silver Rates | యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ధగధగ మెరుస్తోంది. అంతర్జాతీయంగా మంగళవారం ఔన్స్ బంగారం ధర 0.22 శాతం వృద్ధితో 2658.30 డాలర్లు పలికింది. మున్ముందు గణనీయంగా వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వు ప్రకటించడంతో మంగళవారం బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. సోమవారం ఔన్స్ బంగారం 0.04 శాతం పెరిగి 2647.30 డాలర్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. మరోవైపు మంగళవారం ఔన్స్ వెండి ధర 31.21 డాలర్లు పలికింది. సోమవారం వెండి ఔన్స్ ధర ధర 30.96 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఫ్లాట్గా కొనసాగాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.76,950 వద్ద యధాతథంగా కొనసాగింది. సోమవారం రూ.600 వృద్ధితో రూ.76,950లకు చేరుకుని ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. గత మార్చి 22 తర్వాత తులం బంగారం గరిష్ట స్థాయికి తిరిగి పుంజుకోవడం ఇదే మొదటిసారి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్ ట్రేడ్ లో అక్టోబర్ డెలివరీ బంగారం తులం ధర రూ.248 పెరిగి రూ.74,543 వద్ద స్థిర పడింది. కిలో వెండి కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ ధర రూ.469 పుంజుకుని రూ.89,700 పలికింది. రోజువారీ మార్కెట్లో కిలో వెండి రూ.90 వేల వద్ద కొనసాగుతున్నది.