Gold-Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ధగధగ మెరిసింది. శుక్రవారం ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,200 వృద్ధి చెంది రూ.75,550లకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బంగారం ధర భారీగా పెరిగింది. మరోవైపు వరుసగా నాలుగో సెషన్లో కిలో వెండి ధర రూ.2000 పుంజుకుని రూ.89 వేల మార్కుకు చేరుకున్నది. గురువారం కిలో వెండి ధర రూ.87 వేల వద్ద స్థిర పడింది. కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ వచ్చే వారం యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాల మధ్య బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. ఫెస్టివల్ సీజన్ కావడంతోపాటు పెండ్లిండ్ల సీజన్ కావడంతో బంగారం, వెండి ఆభరణాల కోసం కస్టమర్ల నుంచి మద్దతు లభించింది.
బంగారం, వెండిలపై దిగుమతి సుంకం 15 నుంచి ఆరు శాతానికి తగ్గిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ప్రతిపాదిస్తూ గత జూలైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత బంగారం తులం ధర రూ.5000 తగ్గి రూ.71,050లకు చేరుకున్నది. తర్వాత యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయంపై అంచనాలు, దేశీయంగా పండుగలు – పెండ్లిండ్ల సీజన్ కావడంతో తిరిగి బంగారం ధర పెరుగుతున్నది.
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.74 శాతం వృద్ధితో 2599.70 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర 30.47 డాలర్ల గరిష్టానికి దూసుకెళ్లింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లు తగ్గించడంతోపాటు డాలర్ ఇండెక్స్ బలహీన పడటంతో వెండి ధర మూడు వారాల గరిష్ట స్థాయికి పెరిగింది.