న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ ప్రియమైంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పుంజుకున్నాయి. ఇదే క్రమంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.2,600 ఎగబాకి రూ.1,24,400 పలికింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర కూడా అంతే స్థాయిలో ఎగబాకి రూ.1,23,800కి చేరుకున్నట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం బంగారం ధర రూ.1,580 అధిమై రూ.1,22,400కి చేరుకోగా, 22 క్యారెట్ ధర కూడా అంతే స్థాయిలో అధికమై రూ.1,12,200 పలికింది. బంగారంతోపాటు వెండి కూడా పరుగులు పెట్టింది.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.6,700 ఎగబాకి రూ.1,51,700కి చేరుకున్నది. ఇటు హైదరాబాద్‌లోనూ కిలో వెండి రూ.1,000 ఎగబాకి రూ.1.66 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4 వేల డాలర్ల పైకి చేరుకోవడంతో దేశీయంగా ధరలు భారీగా పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధరలు గ్లోబల్ మార్కెట్లో ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి. ఔన్స్ గోల్డ్ ఏకంగా 77 డాలర్లు పెరిగి 4,029 డాలర్లకు చేరుకోడా, వెండి 48.40 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.