న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: రికార్డుస్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర గురువారం ఒకేరోజు రూ.1,150 తగ్గి రూ.88,200కి దిగొచ్చినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర అంతేస్థాయిలో తగ్గి రూ.87,800కి దిగొచ్చింది.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి రూ.1,000 తగ్గి రూ.98,500కి దిగింది. అంతకుముందు ఇది రూ.99,500గా ఉన్నది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.440 తగ్గి రూ.87,380కి తగ్గగా, 22 క్యారెట్ ధర కూడా రూ.400 దిగొచ్చి రూ.80,100గా నమోదైంది. కిలో వెండి రూ.1.06 లక్షలుగా ఉన్నది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో పదిగ్రాముల బంగారం ధర రూ.85 వేలకు తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,892.95 డాలర్లకు పడిపోగా, వెండి 32,47 డాలర్ల వద్ద ఉన్నది.