న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 : బంగారం ధరలు భగభగమండుతున్నాయి. తొలిసారిగా లక్ష రూపాయల మైలురాయిని అధిగమించి రికార్డు నెలకొల్పింది పుత్తడి. దేశీయ రాజధానిలో పదిగ్రాములు బంగారం ధర రూ.1,800 ఎగబాకి లక్ష రూపాయల పైకి చేరుకున్నది. ప్రాంతీయ ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు వచ్చేవారంలో అక్షయ తృతీయ, ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ అధికంగా ఉంటుందన్న అంచనాతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ట్రేడ్ వార్తో ప్రపంచ దేశాల ఆర్థికంపై అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణం. దీంతో ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిప పుత్తడి ధర చారిత్రక గరిష ్ఠ స్థాయి రూ.1,01,600కి చేరుకున్నది. సోమవారం ఇది రూ.99,800గా ఉన్నది.
గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు బంగారం ధర రూ.22,650 లేదా 29 శాతం ఎగబాకింది. మరోవైపు, వెండి ధరలు నిలకడగా రూ.98,500 వద్ద స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ తులం గోల్డ్ ధర రూ.3,000 ఎగబాకి రూ.1,01,350కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.98,350గా ఉన్నది. 22 క్యారెట్ ధర రూ.2,750 అందుకొని రూ.92,900 పలికింది. కిలో వెండి రూ.1,11,000గా నమోదైంది. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలతో సామాన్యుడితోపాటు సంపన్నవర్గాలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. 30న అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు తగ్గే అవకాశాలున్నాయని బులియన్ వర్తకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.