న్యూఢిల్లీ, జూలై 2: బంగారం ధరలు మరింత ప్రియమయ్యాయి. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా పుత్తడి మళ్లీ రూ.99 వేల మార్క్‌ను అధిగమించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో బంగారానికి డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు అంతర్జాతీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వర్తకులు వెల్లడించారు. దీంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.500 అధికమై రూ.99,170 పలికింది.
ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.450 అధికమై రూ.98,600 పలికింది. కానీ, వెండి యథాతథంగా నమోదైంది. కిలో వెండి రూ.1,04,800గా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉంటుందని నూవామా ప్రొఫెషనల్ క్లయింట్స్ హెడ్ అభిలాశ్ కోయికారా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,342.44 డాలర్లుగా నమోదైంది.