Gold Rate Hike | బంగారం భగ్గుమంటున్నది. ఇటీవల కొంత తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ పైపైకి కదులుతున్నది. నిన్న భారీగా పెరిగిన ధర.. గురువారం సైతం స్వల్పంగా పెరిగింది. స్టాకిస్టులు నిరంతరం కొనుగోళ్లు జరుపుతుండడంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పైకి కదిలాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి తులానికి రూ.99,620కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.400 తులానికి రూ.99వేల మార్క్ చేరుకుంది. అదే సమయంలో వెండి రూ.1,000 పెరిగి కిలోగ్రాముకు రూ.1,05,800 చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. డాలర్ బలహీనపడిన నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగిందని.. డాలర్ ఇండెక్స్ 3.5 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు.
అలాగే, యూఎస్ ట్రెజరీ దిగుబడి (ప్రభుత్వం జారీ చేసే ట్రెజరీ బాండ్లు లేదా బిల్లులను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు లభించే వార్షిక రాబడి శాతం) రెండు నెలల కనిష్టానికి పడిపోయింది. దాంతో పాటు యూఎస్ వాణిజ్య సుంకాల గడువు ఆందోళనలు మరోసారి పెరిగాయి. ఈ క్రమంలో బంగారానికి డిమాండ్‌కు దన్నుగా నిలిచాయని కలాంత్రి పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందాలు సకాలంలో ఖరారు కాని పక్షంలో సుంకాలు ప్రపంచ మార్కెట్లో అస్థిరతకు దారి తీసే అవకాశం ఉండగా.. ఇది బులియన్ ధరలకు మద్దతుగా నిలువనున్నది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఔన్సుకు 8.21 డాలర్లు తగ్గి 3,348.89కి చేరింది. వ్యవసాయేతర పేరోల్స్ (NFP), నిరుద్యోగ డేటాతో సహా ముఖ్యమైన యూఎస్ స్థూల ఆర్థిక డేటా ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ డేటా కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఎల్కేపీ సెక్యూరిటీ రీసెర్చ్ విశ్లేషకుడు వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల పసిడి రూ.99,330 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,050 పలుకుతున్నది. ఇక వెండి ధర రూ.1.21లక్షలు పలుకుతున్నది.