Gold-Silver Price | ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపులో మందగమనం, యూఎస్-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాల మధ్య డాలర్ బలపడింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పడిపోయాయి. 24 క్యారెట్ల పసిడి ధర రూ.1000 తగ్గి తులం ధర రూ.1,23,400కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.1000 తగ్గి తులం రూ.1,22,500కి చేరుకుంది. మరో వైపు బంగారం ధర తగ్గినా.. వెండి మాత్రం పెరిగింది. రూ.3,300 పెరిగి కిలోకు రూ.1.55లక్షలకు చేరుకుంది. వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యల తర్వాత గురువారం బంగారం ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.
అంచనా వేసినట్లు యూఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పావు పాయింట్లు తగ్గించిందని.. డిసెంబర్ సమావేశంలో మరోసారి తగ్గిస్తారన్న అంచనాలున్నాయని సౌమిల్ గాంధీ తెలిపారు. ఈ పరిణామం అమెరికా బాండ్ దిగుబడిని, డాలర్‌ను బలోపేతం చేసిందని, బులియన్ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచిందని సౌమిల్ గాంధీ చెప్పారు. వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యల తర్వాత వాషింగ్టన్, చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నాలుగు రోజుల పతనం తర్వాత.. ప్రపంచ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 53.26 డాలర్లు పెరిగి ఔన్స్‌కు 3,983.87 డాలర్లకు చేరుకుంది. విదేశీ మార్కెట్లలో స్పాట్ వెండి ఔన్సుకు 1.21 శాతం పెరిగి 48.14 డాలర్లకు చేరుకుంది.