Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. వరుసగా రోజు ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.వెయ్యి పెరగడంతో 24 క్యారెట్ల పసిడి ధర తులానికి రూ.1,05,670 చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.800 పెరిగడంతో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.1,04,800కి ఎగిసింది. అదే సమయంలో వెండి ధరలు రూ.1,000 పెరిగి కిలోకు రూ.1.26లక్షలకు చేరుకొని సరికొత్త గరిష్ఠాలను తాకింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధరలను ధ్రువీకరించింది. ఈ నెలలో యూఎస్ ఫెడల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించనుందన్న అంచనాలు.. విదేశీ మార్కెట్ల నుంచి బలమైన డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరిగాయి. అయితే, వెండి ధరలు పెరగడానికి దేశీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఉందని బ్రోకరేజ్ సంస్థ ట్రేడ్జిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ త్రివేశ్ డీ తెలిపారు. దీనికి క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్‌లో పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
యూఎస్ జియోలాజికల్ సర్వే వెండిని ఒక కీలకమైన ఖనిజంగా ప్రతిపాదించడం కూడా కొత్త వేవ్‌ను తీసుకువచ్చిందన్నారు. అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గడం, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా మరింత ఆకర్షణీయంగా మార్చేశాయని త్రివేశ్ డీ పేర్కొన్నారు. ఇక ఎంసీఎక్స్‌లో బంగారం తులానికి రూ.1.05లక్షలు దాటింది. వెండి కిలోకు రూ.1.25లక్షలకు దగ్గరలో ఉన్నది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్‌లో అక్టోబర్ కాంట్రాక్టుకు అత్యధికంగా ట్రేడ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.2,113 లేదా 2.03 శాతం పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠస్థాయి 1000 వద్ద నిలిచింది. ఆ తర్వాత డిసెంబర్ కాంట్రాక్టుకు సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ రూ.1,682 పెరిగి 10 గ్రాములకు రూ.1,06,539 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ కాంట్రాక్టుకు సంబంధించిన సిల్వర్ ఫ్యూచర్స్ సోమవారం రూ.3,117 లేదంటే 2.5 శాతం పెరిగి కిలోకు రూ.1,24,990 రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రపంచ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో కామెక్స్‌లో డిసెంబర్ కాంట్రాక్టుకు సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 3,556.87 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. న్యూయార్క్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 22.51 పెరిగి 3,470.51 డాలర్లకు చేరుకుంది. న్యూయార్క్‌లో కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్సుకు 41 మార్క్‌ను దాటి.. 14 సంవత్సరాల్లో తొలిసారిగా అత్యధిక స్థాయికి చేరింది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 1.96 శాతం పెరిగి 40.47కి చేరుకుంది. రాజకీయ, వాణిజ్య అనిశ్చితి సురక్షితమైన పెట్టుబడికి మద్దతు ఇచ్చిందని.. అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సుంకాలు చట్టవిరుద్ధమని యుఎస్ కోర్టు తీర్పు ఇచ్చిందని.. దాంతో రాజకీయ, వాణిజ్య అనిశ్చితి కొనసాగుతుందని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కమోడిటీ రీసెర్చ్ కైనత్ చైన్వాలా అన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల పసిడి రూ.1,05,880 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.97,050 పలుకుతున్నది. ఇక వెండి కిలోకు రూ.1.36లక్షల వద్ద కొనసాగుతున్నది.